అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా?..
ఉన్నది మెగా ఫ్యాన్సే.. అర్జున్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారు
బ్రాంచిలు, షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? – జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం: ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య జరుగుతోన్న వార్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బొలిశెట్టి స్పందించారు. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు.
మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అని అంతే తప్ప అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్లు తనకు తెలియదన్నారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో అని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. ‘ఆయనను కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో..ఎవడికి కావాలి? అల్లు అర్జున్‌ను రమ్మని అడిగారా? ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల మేం నెగ్గాం’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఒక చోటకు వెళితే అక్కడ కూడా ఓటమి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ తండ్రి ఎంపీగా నిలబడినప్పుడే అర్జున్ నెగ్గించుకోలేకపోయారని, అందరినీ విమర్శించడం మంచిది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment