
20 మంది ఉగ్రవాదులతో కలిసి భారత్‌లోకి చొరబడిన పాక్ దళాలు
పాకిస్థాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని బయటపెట్టుకుంది. చీకటి వేళ ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపింది.
జమ్మూ/కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని బయటపెట్టుకుంది. చీకటి వేళ ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడిలో గాయపడిన మరో జవాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జనవరిలో హద్దు మీరిన పాక్ సైన్యం ఇద్దరు భారత జవాన్లను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి తల నరికిన ఘటన దుమారం రేపింది.
దాడి జరిగిందిలా..
‘పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్‌కు చెందిన ఆరుగురు సైనికులు సోమవారం గస్తీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 01:15 గంటల అనంతరం వారి నుంచి సైనిక స్థావరానికి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో 05:30 గంటల సమయంలో మరో బృందాన్ని వారి కోసం పంపగా ఐదుగురు జవాన్ల మృతదేహాలు తూటా గాయాలతో రక్తపుమడుగులో కనిపించాయి’ అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాయపడిన మరో జవాన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.
అతనికి ఎయిమ్స్‌లో చికిత్స చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్(బీఏటీ) నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, పాక్ సైనికులు, సుమారు 20 మంది సాయుధ ఉగ్రవాదులు 450 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మృతుల్లో ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్, నలుగురు ఇతర ర్యాంకుల అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులను నాయక్ ప్రేమ్ నాథ్ సింగ్, లాన్స్ నాయక్ శంభు శరణ్‌రాయ్, సిపాయి రవినంద్ ప్రసాద్, సిపాయి విజయ్ కుమార్ రాయ్, కులీన్ మన్నెగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో నలుగురు 21 బీహార్ రెజిమెంట్‌కు, ఒకరు 14 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందినవారు.
దేశప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు: ఖుర్షీద్
పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను కాల్చిచంపిన నేపథ్యంలో దీనిపై అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా జవాబిస్తామని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మంగళవారం మాట్లాడుతూ.... ప్రభుత్వానికి తన బాధ్యతలపై అవగాహన ఉందని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే దేశప్రయోజనాలకు అనుగుణంగా సరైన చర్య తీసుకుంటామన్నారు. ‘దేశ భద్రత, శాంతికి విఘాతం కలిగించేలా పరిస్థితులను సృష్టించుకోవాలనుకోవడం లేదు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తాం’ అని పేర్కొన్నారు.
మాకు సంబంధం లేదు: పాక్
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి దాడి చేసి ఐదుగురు భారత సైనికులను హత్యచేసిన ఘటనతో తమ సైనిక బలగాలకు ఎలాంటి సంబంధమూ లేదని పాకిస్థాన్ మంగళవారం వెల్లడించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎల్‌వోసీ వెంబడి పూంచ్ సెక్టార్‌లో జరిగిన దాడిలో ఐదుగురు భారత సైనికుల మరణానికి పాక్ బలగాలే కారణమంటూ భారత మీడియాలోని కొన్ని వర్గాలు ప్రసారం చేసిన కథనాలను పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇజాజ్ చౌదరి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కాల్పులు జరగలేదని తమ సైన్యం ధ్రువీకరించిందని, భారత మీడియా ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు.