అసెంబ్లీలో ముక్తకంఠంతో వ్యతిరేకించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖత ఊహించిందే. కేబినెట్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యపరచలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జీవోఎం నివేదిక కేబినెట్ ముందుకు టేబుల్ ఐటంగా వచ్చినా వ్యతిరేకించలేని సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరే దురదృష్టకరం. జీవోఎం ఏం సిఫారసు చేసిందో చదివే అవకాశం కూడా లేకుండా హడావుడిగా టేబుల్ ఐటంగా ప్రవేశపెట్టడం సరికాదంటూ వ్యతిరేకించే ధైర్యం కూడా లేనివాళ్లు కేంద్ర మంత్రులుగా ఉండటం సీమాంధ్ర ప్రజలకు శాపంగా మారింది. వారి చేతగానితనం మరోసారి తేటతెల్లమైంది.
ఇక భారమంతా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలదే. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు వారు పార్టీలకతీతంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. అసెంబ్లీ అభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ఉండటాన్ని రాష్ట్రపతి కచ్చితంగా ప్రశ్నిస్తారని అనుకుంటున్నాం. ఆయన సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. విభజన ప్రక్రియ నిలిచిపోవటానికి అసెంబ్లీ అభిప్రాయం కారణం అయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో నినదించాలి. ఇలా మాట్లాడాలని మా వేదిక తరఫున ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు సేకరిస్తున్నాం. వారు కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లా చేతులెత్తేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి
నేటి బంద్‌ను జయప్రదం చేయండి
కేంద్ర మంత్రివర్గ దుర్మార్గపు నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 6న బంద్ పాటించాలని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీమాంధ్రలోని రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాష్ట్రపతిని కలిసి కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అన్యాయం, అక్రమం, దుర్మార్గం
కేంద్ర కేబినెట్ నిర్ణయం అన్యాయం, దుర్మార్గం. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. విభజన జరగకుండా తుదివరకు పోరాడుతాం.
- సీవీ మోహన్‌రెడ్డి, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్
ఇది బ్లాక్ డే
ఇది బ్లాక్ డే. సీమాంధ్రుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని, రాజ్యాంగ విలువను కాలరాశారు. ఆర్టికల్-3 దుర్వినియోగమయ్యే పరిస్థితికి ఇది నిదర్శనం. దీన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. జగన్ పిలుపుమేరకు శుక్రవారం నాటి బంద్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
- కె.వి.కృష్ణయ్య, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం
ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ రక్షణ ఎలా కల్పిస్తారు?
తెలంగాణ గవర్నర్, ఇద్దరు కేంద్ర అధికారులకు శాంతిభద్రతల బాధ్యతను అప్పగించడం ఎలా రక్షణ చర్యో అర్ధం కావడం లేదు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రుల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న చర్యలు సరిగ్గా లేవు. తెలంగాణ ముఖ్యమంత్రిని, ఇక్కడి ప్రభుత్వాన్ని తోసిరాజని గవర్నర్ ఎలాంటి రక్షణ కల్పించగలరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కేంద్రం సలహాలు,సూచనలు పాటించడం సాధ్యమవుతుందా?
- ప్రొఫెసర్ కంచె ఐలయ్య