
మోదీపై వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం!
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సోమవారం సభలో చర్చిస్తుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఆజంఖాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'మన దేశ బాద్షా తన తల్లిని వెంట ఉంచుకోరు, కానీ శత్రువు తల్లికి కానుకలు ఇస్తారు. భార్యను వదిలేసిన ఆయన 'బేటీ బచావో' (కూతుళ్లను కాపాడండి) అంటూ పేర్కొనడం విడ్డూరం' అని పేర్కొన్నారు.
2014లో తన ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమ్మకు మోదీ శాలువను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత షరీఫ్ తల్లికి చీరను ఓసారి మోదీ పంపించారు. అయితే, ఆజంఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ వెల్‌లోకి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ మాతాప్రసాద్ పాండే హామీ ఇచ్చినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.