
రైలు పట్టాలపై కలెక్టర్ మృతదేహం
దేశంలో మరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.
- బసచేసిన హోటల్ గదిలో సూసైడ్ నోట్..
- మనిషి మనుగడపై నమ్మకం కోల్పోయా..
- సంచలనంగా మారిన బిహార్ ఐఏఎస్ ముకేశ్ పాండే ఆత్మహత్య
ఘజియాబాద్: దేశంలో మరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. బిహార్‌లోని బక్సర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న ముకేశ్ పాండే.. వేగంగా వస్తున్న రైలుకు ఎరుదుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఢిల్లీ శివారు ఘజియాబాద్ స్టేషన్‌కు సమీపంలో గురువారం జీఆర్పీ పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ముకేశ్ ట్రౌజర్ పాకెట్‌లో ఒక కాగితాన్ని గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా ఆయన బసచేసిన హోటల్ గదిలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
‘నేను.. ముఖేశ్ పాండే, ఐఏఎస్ 2012 బ్యాచ్ బిహార్ క్యాడర్ అధికారిని. ప్రస్తుతం బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్)గా పనిచేస్తున్న నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు వార్తను మా వాళ్లకు తెలియజేయండి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలన్నింటినీ ఒక నోట్‌లో రాశాను. లీలా ప్యాలెస్ హోటల్(ఢిల్లీ)లో నేను దిగిన రూమ్ నంబర్ 742లో నైక్ బ్యాగ్‌లో ఆ నోట్ ఉంది’ అని ముఖేశ్ ట్రౌజర్‌లో దొరికిన కాగితంలో రాసిఉంది.
దాని ఆధారంగా హోటల్ గదికి వెళ్లిన పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేకుండా పోయింది. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని ముఖేశ్ సైసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో యువ ఐఏఎస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించిన విషయం తెలిసిందే.
షాపింగ్ మాల్ 10 అంతస్తు నుంచి దూకుతున్నా..
బక్సర్ కలెక్టర్ ముఖేశ్ పాండే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి ముందు ఆయన తన స్నేహితులతో మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. వెస్ట్ ఢిల్లీలోని జానకీపురిలో 10 అంతస్తుల షాపింగ్ మాల్ పై నుంచి దూకబోతున్నట్లు ముఖేశ్ ఒక స్నేహితుడికి ఫోన్‌లో చెప్పారు. దీంతో ఆ స్నేహితుడు పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. షాపింగ్ మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ముఖేశ్ మెట్రో స్టేషన్‌కు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు ముఖేశ్ జాడను కనిపెట్టలేకపోయారు. చివరికి ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై శవంగా కనిపించారు.
సీఎం నితీశ్ సంతాపం
ముఖేశ్ పాండే సమర్థుడైన అధికారి అని, బక్సర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.