ప్రజల ఖాతాల్లోకి 15 లక్షలు ఎప్పుడు..?
న్యూఢిల్లీ: విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తామని బీజేపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. తాజగా నల్లధన వెల్లడి పథకంలో భాగంగా తొలిసారిగా దేశంలో రూ. 65 వేల కోట్ల బ్లాక్‌మనీ వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున నరేంద్రమోదీ ప్రభుత్వం ఎప్పుడు జమచేయబోతున్నదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
‘కేంద్ర ఆర్థికమంత్రికి అభినందనలు. జన్‌ధన్ యోజన కింద ప్రజల ఖాతాల్లో డబ్బు బదిలీ చేయడం ఆయన ప్రారంభించాలి. లేకుంటే మోదీ, బీజేపీ హామీ ఉట్టిదేనా?’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఆదాయ వెల్లడి పథకం కింద రూ. 65,250 కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సర్జికల్ దాడులు నిర్వహించిన సైన్యాన్ని అభినందించిన దిగ్విజయ్.. 1971లో పాకిస్థాన్ ను రెండుగా విడదీసిన ఇందిరాగాంధీ చర్య కంటే.. ఈ సర్జికల్ దాడులు తీవ్రమైనవా? అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.