అమ్మా.. నాన్నా.. క్షమించండి!
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): 'అమ్మా..నాన్నా..నన్ను క్షమించండి. నాన్నలా బ్రతకాలనుకున్నా కానీ బ్రతుకలేకపోతున్నా. మా ప్రెండ్స్ కలిసి మెలిసి తిరిగాం. ఎంతో ఎంజాయ్ చేశాం. వీడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. చెల్లెళ్లూ.. ఒక అన్నయ్యలా మిమ్ముల్ని మందలించి ఉండవచ్చు నొచ్చుకుంటే క్షమించండి. వార్డన్ సార్.. మీరు నన్ను కన్నకొడుకులా చూసుకున్నారు. మీరు ఊహించి ఉండరు నేను ఇలా చేస్తానని క్షమించండి..'అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఎస్సై కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం, తుజాల్‌పూర్ గ్రామానికి చెందిన గాలి వెంకటేశం, రుకుంబాయ్‌లకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కుమారుడు గాలి విష్ణు (21) నల్గొండ జిల్లా దేశ్ ముఖ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆనంద్ ధియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ హాస్టల్ ఉంటూ చదివే వాడు. ఇక్కడ ఇంటర్ వరకే అనుమతి ఉంన్నా, హాస్టల్ వార్డన్ అనుమతితో ఇప్పటికీ అక్కడే ఉంటూ చదువుకొనసాగిస్తున్నాడు.
అందరితో కలివిడిగా ఉండే విష్ణు.. మంగళవారం రాత్రి 10.30గంటల సమయంలో భోజనం ముగించుకుని వేరే గదిలోకి వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయం 6.15 గంటలకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవమై కనిపించాడు. హాస్టల్‌లో అందరిని లేపేందుకు వెళ్లిన శ్యామ్‌సన్ దీన్ని గమనించి వెంటనే హాస్టల్ వార్డన్ జాన్ వెస్లీకి విషయాన్ని చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్సై కృష్ణ మోహన్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. విష్ణు సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలు పరిశోధిస్తున్నామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.