
హస్తంలో అయోమయం!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభకు అభ్యర్థిని మార్చడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటనతో.. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చి సర్వే సత్యనారాయణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. రాజయ్యనే కొనసాగిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందేమోనని నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు.
నామినేషన్లకు గడువు పూర్తికాక ముందే రాజయ్య బీ-ఫారాన్ని ఉపసంహరింపజేయడంతో పాటు అటు అధిష్టానం, ఇటు జిల్లా నేతలతో టీపీసీసీ వేగంగా సంప్రదింపులు చేసి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే జిల్లాలో ఎక్కువగా పరిచయాల్లేని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడాన్ని శ్రేణులు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నాయి.
గురువారం నాగార్జునసాగర్‌లో పార్టీ సమావేశం ఉండటంతో వరంగల్ ఎన్నికలపై టీపీసీసీ దృష్టి సారించలేకపోయింది. సర్వేతో జిల్లా పార్టీ నేతలు, టీపీసీసీ నేతలు విస్తృత సమావేశం తర్వాత ప్రచారం ప్రారంభించనున్నారు.
అభ్యర్థులు ఎవరైనా గెలుపే ధ్యేయం
గత ఎన్నికల ఓటమి తర్వాత ఎదురుదెబ్బలతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో మెరుగైన ఫలితం సాధించాలని టీపీసీసీ స్థిర నిశ్చయంతో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపికైన తర్వాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక కావడంతో ఆయన కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అయితే ఇతర పార్టీల వేగాన్ని అందుకోవడానికి ఒకట్రెండు రోజులు సమయం పడుతుందని టీపీసీసీ నేతలు చెబుతున్నారు.
‘‘అభ్యర్థి నివాసంలో జరిగిన దుర్ఘటనతో పార్టీకి నష్టం ఉండదు. పార్టీ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పు జరిగింది. అనుకోని సంఘటనల వల్ల, అభ్యర్థి మార్పు వల్ల ఒకట్రెండు రోజులు కొంత అయోమయం ఉండటం సహజమే. ఇలాంటి ఆటుపోట్లను కాంగ్రెస్ ఎన్నో అధిగమించింది. ఈ సమస్య నుంచి బయటపడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సిద్ధమవుతాయి. అభ్యర్థులు ఎవరనేది కాకుండా పార్టీ గెలుపుపైనే దృష్టి పెడతాం’’ అని టీపీసీసీ నేతలు చెబుతున్నారు.