
సిలిండర్ పేలి.. బేకరీలో భారీ అగ్నిప్రమాదం!
చెన్నై: నగరంలోని ఓ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోడుంగయుర్ ప్రాంతంలోని మీనంబల్ వీధిలో ఉన్న బేకరీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలోనే బేకరీలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
దీంతో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 48మందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కిల్పాక్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని తమిళనాడు ముఖ్యంమంత్రి పళనిస్వామితోపాటు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం పళనిస్వామి హామీ ఇచ్చారు.