
చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం
లండన్: రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే చాలు. గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువగా ఉంటుందని, ఈ జబ్బుల ద్వారా మరణించే అవకాశం 25 శాతం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. చాక్లెట్‌కు, గుండె సమస్యలకు ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అబిర్డీన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 21వేల మందిని పన్నెండేళ్ల పాటు అధ్యయనం జరిపి ఈ ఫలితాలు వెల్లడించారు. రోజుకు వంద గ్రామ్‌ల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్లు తిన్నవారికి హృదయ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం తగ్గినట్లు గుర్తించారు. చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావనే విషయానికి విరుద్ధంగా తమ అధ్యయన ఫలితాలున్నాయని వారు వివరించారు.