తమ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎవరికైన కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన చెన్నైలో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 15 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు యూ టర్న్ తీసుకుంటున్నాయని వీహెచ్ ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో తాను సమైక్యవాదినని సీఎం ప్రకటించడం పట్ల వీహెచ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కిరణ్ ధిక్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కిరణ్పై చర్యలు తీసుకుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.