జీఎస్టీ మినహాయింపు వాళ్లకు మాత్రమేనట!
జీఎస్టీ మినహాయింపు వాళ్లకు మాత్రమేనట!
Published Fri, Sep 23 2016 4:01 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఏకీకృత పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లు మినహాయింపులను జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడానికి టర్నోవర్ పరిమితిని రూ.20లక్షలుగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అదేవిధంగా ఈశాన్య, కొండ ప్రాంతాల్లో ఈ మినహాయింపు లిమిట్ రూ.10 లక్షలని కౌన్సిల్ పేర్కొంది. జీఎస్టీ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల పాటు సమావేశమైంది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మినహాయింపులపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించింది. ప్రామాణిక జీఎస్టీ రేటు, డ్రాప్ట్ నిబంధనలను తర్వాతి భేటీలో ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. సెప్టెంబర్ 30న, అక్టోబర్ 17-19 తేదీల్లో ఈ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది. అక్టోబర్ 17,18,19 తేదీల్లో జరిగే మీటింగ్లో జీఎస్టీ రేటును స్లాబ్స్ను నిర్ణయిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ రేటుపై కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఇక అన్ని సెసీలు జీఎస్టీ కిందకు వస్తాయని తెలిపారు. టర్నోవర్ పరిమితులతో పాటు మినహాయింపు ఐటమ్స్ను కూడా 300ల నుంచి 90కు తగ్గించింది. దీంతో జీఎస్టీ మినహాయింపులపై తెగ ఆశలు పెట్టుకున్న వారికి కొంత నిరాశే ఎదురైనట్టైంది.
Advertisement