సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసులో బాలిస్టిక్ విశ్లేషణ నివేదికలు, సీసీటీవీల నివేదికలు, డీఎన్‌ఏ రిపోర్టులు, పోస్టుమార్టం నివేదికలు, ఇతర స్థాయీ నివేదికల్ని సిద్ధం చేసి తమ ముందుంచాలని హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై సిట్ వాదనలు వినిపించేందుకు వీలుగా తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.
కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, బాధిత కుటుంబసభ్యులు వేర్వేరుగా పిటిషన్లు వేయడం తెలిసిందే. అలాగే సిట్ ఏర్పాటును సవాలుచేస్తూ వాసిరెడ్డి శ్రీకృష్ణ అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. వీటన్నింటినీ కలపి ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వృందాగ్రోవర్, డి.సురేశ్‌కుమార్, వి.రఘునాథ్‌లు ఈ కేసును సీబీఐకి ఎందుకప్పగించాలో వివరిస్తూ వాదనలు వినిపించారు.
బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు?
కేసు దర్యాప్తును పూర్తిచేసే విషయంలో సిట్ ఉద్దేశపూర్వకంగా అసాధారణ జాప్యం చేస్తోందని, దీనివల్ల బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులుండవని, కాబట్టి కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని వృందాగ్రోవర్ నివేదించారు. ఎన్‌కౌంటర్ కేసును హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ సిట్ జాప్యం చేస్తోందని, దీన్నిబట్టి దర్యాప్తు తీరు ఎలాగుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఫిబ్రవరి 10కి ఎన్‌కౌంటర్ జరిగి ఏడాదవుతుందని, అప్పటికీ దర్యాప్తు పూర్తికాలేదంటే.. బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించడంలోనే సిట్ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయన్నారు.
అన్ని నివేదికల్ని కోర్టు ముందుంచండి
Published Fri, Jan 29 2016 4:25 AM | Last Updated on Thu, Jul 11 2019 7:41 PM
Advertisement
Advertisement