ప్రభుత్వం గుండెల్లో గునపాన్ని దింపుతాం
సీపీఐ నేత నారాయణ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ ఖనిజంపై పడే ప్రతి గునపాన్ని ప్రభుత్వ గుండెల్లో దింపుతామని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. బాక్సైట్ మైనింగ్ అంశంపై గిరిజనులు మూడువైపుల నుంచి దాడులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ అణ చివేత ఒకవైపు, కార్పొరేట్ ముసుగులో మైనింగ్ మాఫియా, మరోవైపు నక్సలైట్లు గిరిజనులపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న గిరిజను ల హత్యలను సర్కార్ హత్యలుగానే తాము భావిస్తున్నామన్నారు. గురువారం మఖ్దూం భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో బాక్సైట్ తవ్వకాలను బాబు వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదేదారిలో సాగుతున్నారని విమర్శించారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు బాక్సైట్ తవ్వకాల ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్నంతటిని చోద్యంగా చూస్తోందని ధ్వజమెత్తారు. ఒడిశా లో పాస్కోకు, మైనింగ్ మాఫియాకు వ ్యతిరేకంగా సీపీఐ అగ్రనేత బర్ధన్ సాగించిన పోరాట స్ఫూర్తితో తామూ పోరాడతామన్నారు.