పొద్దున లేవగానే పళ్లు తోముకోవడం ఎంత సహజమో, ఫేస్ బుక్ చూడడం అంతే సహజంగా మారింది. లైకులు, షేరింగులతో 'ముఖపుస్తకం' తెరవడం నెటిజన్లకు అలవాటుగా మారింది. 11 ఏళ్ల క్రితం ఇంటర్నెట్లోకి దూసుకొచ్చి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్ బుక్ సోషల్ మీడియాలో అత్యధిక మంది వీక్షించే వెబ్ సైట్ గా ఫేమస్ అయింది. నెలకు దాదాపు 139 కోట్ల మంది ఫేస్ బుక్ వీక్షిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఫేస్ బుక్ పేజీలకు కుప్పలు తెప్పలుగా లైకులు వచ్చిపడుతుంటాయి. అత్యధిక లైకులతో అగ్రస్థానంలో ఉన్న 10 మంది సెలబ్రిటీల పేర్లను సోషల్ మాడియా ట్రాకింగ్ సంస్థ 'ఫ్యాన్ పేజీ లిస్ట్' వెల్లడించింది.
పోర్చుగీస్, రియల్ మాడ్రిడ్ సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అత్యధిక లైకులతో అగ్రస్థానంలో నిలిచాడు. 10,35,76,615 లైకులతో టాప్ లో ఉన్నాడు. సంపాదనలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. దాదాపు రూ.16 వేల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ బెక్ హామ్ అతడి కంటే ముందున్నాడు.
కొలంబియా పాప్ సింగర్, బెల్లీ డాన్సర్ షకీరా ఫేస్ బుక్ ను షేక్ చేస్తోంది. 10,07,32, 587 లైకులతో రెండో స్థానం దక్కించుకుంది. సుమారు రూ. 14వేల కోట్ల సంపద కలిగిన షకీరా గోల్డెన్ గ్లోబ్, గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. యూనిసెఫ్ అంబాసిడర్ గానూ ఆమె కొనసాగుతోంది.
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు విన్ డీసెల్ 93,17,23,15 లైకులతో మూడో స్థానంలో ఉన్నాడు. గ్లామర్ ఫోటోలకు తోడు టిడ్ బిట్స్ జోడించి చేసే ఫేస్ బుక్ పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటాయి. అతడి సంపద సుమారుగా 480 కోట్ల రూపాయలు.
ఎమినెమ్ గా సుప్రసిద్ధుడైన అమెరికన్ రాపర్ పేస్ బుక్ లో 91,99,19,71 లైకులు అందుకుని 4వ స్థానంలో నిలిచాడు. నిర్మాత, నటుడు కూడా అయిన ఎమినెమ్ ఆస్తుల విలువ సుమారు రూ. 12 వేల కోట్లు.
పాప్ గాయని రిహానా ఫేస్ బుక్ పేజీ అభిమానుల సందేశాలతో సదా నిండివుంటుంది. ఆమె ఫేస్ బుక్ ఖాతాలో 81,54,93,44 లైకులు ఉన్నాయి. పాప్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆమె సంపద దాదాపుగా రూ. 9వేల కోట్లు. 'మోస్ లైక్స్' లిస్ట్ లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
సంపన్న సాకర్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 77,88,14,94 లైకులతో సిక్త్ ప్లేస్ లో ఉన్నాడు. అర్జెంటీనా, ఎఫ్ బీ బార్సిలోనా తరపున ఆడుతున్న మెస్సీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 11 వేల కోట్లు.
చనిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పై అభిమానుల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 75,30,04,78 లైకులతో పాప్ చక్రవర్తికి ఏడో స్థానంలో నిలిపారు అభిమానులు. మైఖేల్ జాక్సన్ సంతోషంగా గడిపిన రోజుల్లో దిగిన ఫోటోలతో అతడి ఫేస్ బుక్ పేజీ నిండివుంటుంది. మరణించిన తరువాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన సెలబ్రిటీస్ జాబితాలో టాప్ లో నిలిచాడు.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ 73,69,14,92 లైకులతో 8వ స్థానంలో ఉన్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విల్ స్మిత్ సంపద సుమారు రూ. 14 వేల కోట్లు.
మరణించి 34 ఏళ్లు గడిచినా పాప్ సింగర్ బాబ్ మార్లేకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతడి పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో 73,51,38,81 లైకులు ఉన్నాయి. అత్యధిక లైకుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు.
'జస్టిన్ ఐ లవ్ యూ, జస్టిన్ ఐ హేట్ యూ' సందేశాలతో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ఫేస్ బుక్ పేజీ నిండిపోయి వుంటుంది. ఫేస్ బుక్ లైకులు అతడి బ్యాంకు బాలెన్స్ ను మించిపోయాయి. 72,72,47,46 లైకులతో పదో స్థానంలో నిలిచాడు. అతడి సంపద రూ. 12 వేల కోట్లు.
మోస్ట్ పాపులర్ యూజర్ ఎవరు?
Published Thu, Jun 11 2015 3:43 PM | Last Updated on Thu, Jul 26 2018 12:47 PM
Advertisement
Advertisement