హైదరాబాద్ లాంటి నగరాల్లోని బిజీ ట్రాఫిక్లో ఒక కారు వేగంగా వెళ్తుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి కారు ఇంజన్ దానికదే ఆగిపోతుంది.
హైదరాబాద్ లాంటి నగరాల్లోని బిజీ ట్రాఫిక్లో ఒక కారు వేగంగా వెళ్తుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి కారు ఇంజన్ దానికదే ఆగిపోతుంది. ఎందుకలా జరిగిందో తెలియక డ్రైవింగ్ సీట్లో ఉన్నవాళ్లు తికమక పడతారు. ఆ పని చేసినవాళ్లు మాత్రం.. ఎక్కడో దూరంగా ఉండి, హాయిగా నవ్వుకుంటారు. ఇదంతా సైబర్ హ్యాకింగ్ చేసే మాయాజాలం. ఇంటర్నెట్ ఉపయోగించుకుని తాము కదులుతున్న కారు ఇంజన్ ఆపేయగలమని సీనియర్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అంటున్నారు. అయితే.. జీపీఎస్ కనెక్టివిటీ ఉన్న కార్లు, ట్రక్కుల భద్రత విషంలో దీనివల్ల పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
అమెరికా జాతీయ భద్రతా సంస్థలో గతంలో పనిచేసిన చార్లీ మిల్లర్ అనే హ్యాకర్ ఇప్పుడు ట్విట్టర్లో పనిచేస్తున్నారు. ఈయనతో పాటు క్రిస్ వాలాసెక్ అనే మరో పరిశోధకుడు కలిసి ఈ ప్రయోగాలు చేశారు. ఫియట్ క్రిస్లర్ టెలిమాటిక్స్ సిస్టమ్ను ఉపయోగించి, హైవే మీద వెళ్తున్న ఓ కారును ఆపేశారు. అయితే.. ఇదంతా ముందుగానే చెప్పి చేసిన ప్రయోగం. స్టీరింగ్, బ్రేకులు, ఇంజన్ అన్నింటికీ ఇంటర్నెట్ నుంచే కమాండ్ ఇవ్వడం ద్వారా తమ ప్రయోగాన్ని పూర్తిచేశారు. అయితే, రోడ్డుమీద ఏవైనా వాహనాలు ప్రమాదకరంగా, అనుమానస్పదంగా వెళ్తున్నాయనుకుంటే వాటిని ఆపేందుకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లకు ఉన్నట్లే.. కార్ల సాఫ్ట్వేర్కు కూడా అప్డేట్లు ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు వేసుకుంటే భద్రతాపరమైన సమస్యలు ఉండబోవని ఫియట్ కంపెనీ నిపుణులు చెబుతున్నారు.