
చార్మినార్ వద్ద పోలీసులతో జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ కార్మికుల వాగ్వాదం
ప్రధాన రహదారుల నుంచి వీధుల చివరిదాకా ఎక్కడ చూసినా చెత్త.. పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురికినీరు..
* కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం
* పరిష్కారంపై దృష్టిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం
* ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్తాచెదారం
* ఐదు రోజులుగా కుళ్లి దుర్గంధం.. వెలువడుతున్న విష వాయువులు
* పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు
* వర్షాలు పడితే అంటురోగాలు ప్రబలే ప్రమాదం
* అరకొర రెగ్యులర్ కార్మికులపైనే భారం
* సమ్మె విరమించినా.. ‘చెత్త’ పోవాలంటే వారం పట్టే అవకాశం
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు
కాంట్రాక్టు కార్మికులు (సుమారుగా): 26,000మంది
ఒకరోజులో తరలించే వ్యర్థాలు: 3,800 టన్నులు
రోజులో ఊడ్చే రహదారుల పొడవు: 8,000 కి.మీ.
రోజులో శుభ్రం చేసే కాల్వల పొడవు: 749 కి.మీ.
సాక్షి, హైదరాబాద్: ప్రధాన రహదారుల నుంచి వీధుల చివరిదాకా ఎక్కడ చూసినా చెత్త.. పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురికినీరు.. ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం, విష వాయువులు.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంస్థల్లో పరిస్థితి ఇది. కుళ్లిపోతున్న వ్యర్థాలతో కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి. వీధులన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంస్థల కార్మికుల సమ్మెతో ఏర్పడిన పరిస్థితి ఇది. వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం వారు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా.. పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కార్మిక నేతలతో మంత్రులు ఈటల, నాయిని చర్చించినా.. ఎవరూ ఒక మెట్టుకూడా దిగిరాకపోవడంతో ఫలితం శూన్యం. మరోవైపు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, డ్రైనేజీ నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండడంతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చెత్త తరలింపునుకు అధికారులు చేస్తున్న యత్నాలేవీ ఫలించడం లేదు. దాదాపు 40 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉండగా.. అరకొర సంఖ్యలో ఉన్న రెగ్యులర్ కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు.
అక్కడే ప్రతిష్టంభన..
కనీస వేతనాల పెంపుతో పాటు 16 డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగినప్పటికీ.. ప్రధానంగా వేతన పెంపుపైనే ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో రూ.8,500, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 కనీస వేతనం చెల్లిస్తున్నారు. అయితే ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్‌మెంట్‌తో 10వ పీఆర్సీని తమకు కూడా వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలను పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170కి, ఇతర కార్మికులకు రూ.17,380కి పెంచాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక నేతలతో సోమ, మంగళ, బుధవారాల్లో మంత్రులు ఈటల, నాయిని జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గురువారమైతే చర్చల కోసం ప్రభుత్వం నుంచి కార్మిక నేతలకు పిలుపే రాలేదు.
వ్యర్థాల తరలింపు కష్టమే!
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజూ 3,800 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా.. మిగతా 67 నగర, పురపాలికల్లో మరో 2,000 టన్నుల చెత్త వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోజుకు దాదాపు 6,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమ్మె కారణంగా నాలుగు రోజులుగా పారిశుద్ధ్య పనులు 90 శాతం నిలిచిపోవడంతో... రాష్ట్రవ్యాప్తంగా 20 వేల టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్మికులు సమ్మె విరమించినా.. ఈ వ్యర్థాలను తొలగించేందుకు వారంపైనే పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పనిభారంతో సతమతం
ఆరు వేల టన్నుల వ్యర్థాల తరలింపు, 15వేల కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్లు, వీధులను ఊడ్చడం, 10 వేల కిలోమీటర్ల పొడవున్న మురికి కాల్వలను శుభ్రం చేయడం... ఇదంతా కేవలం 40 వేల మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చేస్తున్న పని. ఒక్కో కార్మికుడు ముగ్గురు, నలుగురి పని చేస్తున్నారు. అసలు వీరి సేవలను వేతనాలతో పోల్చడం సాధ్యం కాదు కూడా. ప్రస్తుతం ఈ కార్మికులకు అరకొర వేతనాలే అందుతున్నాయి. అందులోనూ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ల పేరిట మినహాయించుకున్న కోట్ల రూపాయలను లేబర్ కాంట్రాక్టర్లు, అధికారులు స్వాహా చేసేశారు. జబ్బు చేస్తే ఈఎస్‌ఐ సదుపాయం సైతం అందడం లేదని కార్మికులు వాపోతుండడం ఆందోళనకరం. కాగా.. నాలుగు రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాజధానిలోనూ దుస్థితి
సాక్షి నెట్‌వర్క్: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె కారణంగా నాలుగు రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 16,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. చాలా చోట్ల రోడ్లు, బస్తీలన్నీ దుర్గంధ భరితంగా మారాయి. దోమలు పెరిగిపోయాయి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్‌లోని దాదాపు 1,500 బస్తీలు, 900 కాలనీల్లో ఇదే దుస్థితి. చెత్త గుట్టలుగా పేరుకుపోయి.. రోడ్ల నిండా విస్తరిస్తోంది. ఇక హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చార్మినార్ వద్ద చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. తాము సమ్మె చేస్తుండగా.. ఈ పనులెలా చేస్తారంటూ నిలదీశారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఓ కార్మికురాలికి చేతికి గాయమైంది. అయితే తమది ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమమేనని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు
జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీల్లో..
తరలించే వ్యర్థాలు: 1,961.75 టన్నులు
పట్టణ రోడ్ల మొత్తం పొడవు: 9,609.14 కిలోమీటర్లు
ఒకరోజులో ఊడ్చే రహదారులు: 7,591 కిలోమీటర్లు (79%)
మొత్తం మురికి కాల్వల పొడవు: 8,547.59 కిలోమీటర్లు
ఒకరోజులో శుభ్రపరిచే మురికి కాల్వల పొడవు: 6,698.34 (78%)
కంపు కొడుతున్న కాలనీలు
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతోఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ప్రధాన రహదారుల నుంచి వీధుల వరకు ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 964 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులతో పాటు వారికి మద్దతుగా 256 మంది సిబ్బంది కూడా సమ్మెకు దిగారు. దీంతో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వరంగల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో 3,074 మంది కార్మికులు ఉండగా.. 2,051మంది సమ్మెలో పాల్గొంటున్నారు.
రోడ్లు, వీధులన్నీ అపరిశుభ్రంగా మారారుు. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలలో రోడ్లన్నీ చెత్తమయం అయ్యాయి. పందులు స్వైర విహారంతో దుర్గంధం వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, మిర్యాలగూడ మున్సిపాలిటీలు చెత్తతో నిండిపోయాయి. పలు కాలనీల్లో డ్రైనేజీలు నిండిపోయి కంపుకొడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, మధిర మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయి. వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పట్టణ కేంద్రాలు కంపుకొడుతున్నాయి. కాలనీలన్నీ కంపుకొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, మందమర్రి మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పూర్తిగా నిలిచిపోయింది.
ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తొలగిస్తున్నాం: జీహెచ్‌ఎంసీ
జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని, పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా వాడుకుంటున్నామని వివరించింది. చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. చెత్త తొలగించేందుకు చర్యలు చేపట్టామన్న జీహెచ్‌ఎంసీ వివరణను నమోదు చేసుకుని విచారణను వాయిదా వేసింది.