వాల్‌మార్ట్ తప్పు చేయలేదు
వాల్‌మార్ట్ తప్పు చేయలేదు
Published Fri, Oct 18 2013 3:46 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
న్యూఢిల్లీ: భారత్‌లో సూపర్ మార్కెట్ చైన్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా రిటైల్ దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను వాల్‌మార్ట్ ఉల్లంఘించలేదని తేల్చింది. వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ ఈ నిర్థారణకు వచ్చింది. ప్రభుత్వం ఇటీవల సవరించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా), బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ నియంత్రణల మార్గదర్శకాలను వాల్‌మార్ట్ ఉల్లంఘించినట్లు రుజువుకాలేదని ఈడీ పేర్కొంది. ఆర్‌బీఐ నుంచి తాజా మార్గదర్శకాలు వస్తే తప్ప.. ఈ దర్యాప్తు విషయంలో ముందుకు వెళ్లేందుకు బలమైన ఆధారాలు లేవని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
సీపీఐ ఎంపీ అచ్యుతన్ వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఆరోపణలు చేస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాసిన తర్వాత ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు నిర్వహించింది. 2010లో వాల్‌మార్ట్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సెడార్ సపోర్ట్ సర్వీసెస్‌లో కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 10 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టిందని అచ్యుతన్ పేర్కొన్నారు. భారతీ సెడార్ ద్వారా ‘ఈజీ డే‘ పేరుతో బహుళ బ్రాండ్ల చిల్లర రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడులు అక్రమమని, ఈ నిధులను భారతీ సూపర్ మార్కెట్ల కోసం వినియోగిస్తోందని అచ్యుతన్ ఆరోపించారు.
వాల్‌మార్ట్ పెట్టుబడుల సమయానికి బహుళబ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐకు అనుమతి లేదు. దర్యాప్తులో తాను గుర్తించిన విషయాలను ఈడీ ఆర్‌బీఐకి నివేదించింది. భారతీ రిటైల్‌లో సెడార్ పెట్టుబడులు ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన ఆదేశాలు, నోటిఫికేషన్‌కు లోబడే ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక, సెడార్‌లో 10కోట్ల డాలర్ల కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను సరైన సమయంలో 49శాతం ఈక్విటీ కింద మార్చుకోనందుకు వాల్‌మార్ట్‌తోపాటు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్‌బీఐ జరిమానా విధించడం లేదా హెచ్చరించడం చేయవచ్చని చెప్పాయి.
Advertisement