
గౌరీలంకేష్‌ను హత్య చేసింది ఎవరు?
- నక్సలైట్ల హస్తముండొచ్చు అంటున్న సోదరుడు
- హిందుత్వ అతివాదులపైనా అనుమానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమెను ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరీలంకేశ్ సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. గౌరీలంకేశ్‌కు నక్సలైట్ల నుంచి బెదిరింపులు, విద్వేష లేఖలు అందాయనే విషయాన్ని పోలీసులు తనకు తెలిపారని ఆయన వెల్లడించారు. ఆమె హత్య వెనుక నక్సలైట్ల కోణం ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి గౌరీలంకేశ్ చురుగ్గా పనిచేశారని, ఆమె ఇలా చేయడం నక్సలైట్లకు గిట్టలేదని తెలిపారు. 'పలువురు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె సఫలమయ్యారు. దీనివల్ల ఆమెకు బెదిరింపు లేఖలు, విద్వేష మెయిళ్లు అందాయి' అని వివరించారు. అంతేకాకుండా మావోయిస్టులెవరూ జనజీవన స్రవంతిలో కలువకూడదని హెచ్చరిస్తూ నక్సలైట్లు కర్ణాటకలో పాంఫ్లెట్లు కూడా పంచారని గుర్తుచేశారు. అయితే, తనకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆమె తమకు తెలుపలేదని చెప్పారు.
కొన్నిరోజుల కిందట గౌరీలంకేశ్‌తో సీఎం సిద్దరామయ్య సమావేశమయ్యారని, అప్పుడు కూడా తనకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆమె సీఎంకు తెలుపలేదని చెప్పారు. ఆమె హత్య వెనుక నక్సలైట్ కోణముందా? లేక హిందు అతివాద కోణముందా? దర్యాప్తులోనే తేల్చాలని ఆయన అన్నారు. సోదరి గౌరీతో తనకు భావజాల విభేదాలు ఉండేవని, అయితే, తను నమ్మిన భావజాలానికి కట్టుబడు నిలబడిన ఫైర్‌బ్రాండ్ వ్యక్తిత్వం ఆమెదని ఇంద్రజిత్ ప్రశంసించారు.
కర్ణాటకలో జరిగిన హేతువాది, మాజీ ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి హత్య తరహాలోనే గౌరీలంకేశ్‌ను చంపేయడంతో ఈ ఘటన వెనుక హిందుత్వ అతివాదుల హస్తముండొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎంఎం కల్బుర్గి హత్యకేసులో కర్ణాటక పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో గౌరీలంకేశ్ హత్యకేసు కర్ణాటక పోలీసులపై ఒత్తిడి పెంచుతోంది.