
ధోనీ, అర్నబ్, రాంరహీంలకు కేంద్రం నో!
పద్మ పురస్కారాల తిరస్కరణ..
పలువురు ప్రముఖ వ్యక్తులకు పద్మా పురస్కారాలు అందజేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు గుర్మీత్ రాంరహీం సింగ్, తబలా మ్యాస్ట్రో జకీర్ హుస్సేన్, జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తదితరులకు పద్మా అవార్డులు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కేంద్రం తోసిపుచ్చిందని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక ఓ కథనంలో తెలిపింది.
అయితే, ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ పేర్లు మొదటి నామినేషన్ల జాబితాలో లేవని, అయినా వారికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిందని పేర్కొంది. ప్రతిష్టాత్మకమైన పద్మా పురస్కారాలు 'ప్రజావ్యవహారాల' విభాగంలోకి వస్తాయని, ఈ అవార్డులు ఎవరికి ఇవ్వాలన్న విషయంలో కేంద్రం విచక్షణాధికారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేడీ ఎంపీ బైజయంతి పాండా, సంగీత దర్శకుడు అనూ మాలిక్, 1986లో విమాన హైజాక్ వ్యవహారంలో హత్యకు గురైన ఎయిర్‌హోస్టెస్ నీర్జా బనోత్ తదితర ప్రముఖులకు కూడా కేంద్రం పద్మ పురస్కారాలను నిరాకరించింది.
ఏడుగురు పద్మవిభూషణ్, ఏడుగురికి పద్మభూషణ్ సహా మొత్తం 89మందికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.