హార్దిక్ పటేల్ సహా 78మంది అరెస్ట్
సూరత్ : తమకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని... ఇటు గుజరాత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ను శుక్రవారం సూరత్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వారచ్చా పోలీస్ స్టేషన్కి తరలించారు.
పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న పటేల్ వర్గీయులు శనివారం ఏక్తాయాత్రకు సిద్ధమయ్యారు. సూరత్‌లో ఈ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా హార్దిక్ పటేల్ సహా కొంతమంది పటేల్ వర్గీయులు సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత యాత్రకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏక్తాయాత్రకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు హార్దిక్ పటేల్‌తో పాటు 78మందిని అదుపులోకి తీసుకున్నారు.