జడివాన..!
ఎడతెరిపిలేని వర్షాలతో తడిసిముద్దవుతోన్న రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకోవడంతో తెలంగాణ రాష్ట్రం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. బావులు, బోర్లలోకి నీరు వచ్చి చేరుతోంది. కొన్నిచోట్ల చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా సాయంత్రం పూట వర్షం కురుస్తూనే ఉంది.
వచ్చే 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. మహబూబ్‌నగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల ప్రభావం కొనసాగితే ఆయా జిల్లాల్లోని జలాశయాలు నిండే అవకాశాలున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు వరకే కొనసాగుతాయి కాబట్టి ఈ లోగా కురిసే వర్షాలే అటు రబీ పంటలకు, ఇటు ఎండాకాలంలో తాగునీటికి ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కొద్దిరోజులుగా వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న పంటలు తాజా వర్షాలతో ఊపిరిపీల్చుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ తీవ్ర నిరాశలో కూరుకుపోయిన రైతన్న వరి సహా ఇతర రబీ పంటల సాగుకు సమాయత్తమవుతున్నాడు.
గత వారం సరాసరి 33.9 మిల్లీమీటర్ల వర్షపాతం
రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు కురిసిన వర్షాలకు సరాసరి 33.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
ముంచెత్తుతోంది..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు నగరంలో రెండు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. జడివానతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం వేళ వర్షం కురియడంతో పలు ప్రధాన రహదారులపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.