
నాయకులకు షాక్.. ఈసీ కీలక సిఫారసు!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఎన్నికల్లో ఒకటికి మించి స్థానాల్లో పోటీచేస్తున్న రాజకీయ నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తి ఒకేసారి రెండుస్థానాల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. అలా చేయని పక్షంలో కనీసం రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఒకదానిని ఖాళీ చేసి ఉప ఎన్నికలకు కారణమైతే.. అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశించేలా ఎన్నికల చట్టాల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు, లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో గరిష్ఠంగా రెండుస్థానాల్లో పోటీచేసేందుకు అనుమతినిచ్చింది. అయితే, రెండుస్థానాల్లో గెలుపొందినా ఒకే స్థానంలో మాత్రమే కొనసాగాలని నిబంధనలు విధించింది. 1996కు ముందు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీచేసే అవకాశం ఉండేది. కానీ 1996లో తీసుకొచ్చిన ఎన్నికల సవరణలతో ఒక అభ్యర్థి రెండుస్థానాల్లో మాత్రమే పోటీచేసేలా పరిమితి విధించారు.
అయితే, కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లో సెక్షన్ 33 (7)ను మార్చాలని కోరినట్టు ఈసీ తెలిపింది. సెక్షన్ 33 (7)ను సవరించి ఒక అభ్యర్థిని ఒకే స్థానంలో పోటీచేసేలా పరిమితి విధించాలని, ఒకవేళ అది కుదరకపోతే.. కనీసం గెలిచిన అభ్యర్థి సీటును ఖాళీ చేస్తే.. ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును మొత్తం అతను/ఆమె భరించేలా సవరణలు తీసుకురావాలని కోరింది. ఈ వ్యయాన్ని అసెంబ్లీ స్థానానికి రూ. 5 లక్షలుగా, లోక్‌సభ స్థానానికి రూ. 10 లక్షలుగా ఈసీ ప్రతిపాదించింది.