
ఫారెక్స్ నిల్వలు @291 బిలియన్ డాలర్లు
ముంబై: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారాంతానికి 291.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు 5.04 బిలియన్ డాలర్లు పెరిగాయి. డాలర్ల రూపంలో ఉండే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ) పెరగడం మొత్తంగా సానుకూల ఫలితానికి కారణమని ఆర్‌బీఐ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌సీఏలు 5.07 బిలియన్ డాలర్లు ఎగసి 263.73 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
మారకపు ద్రవ్య నిల్వల్లో భాగమైన బంగారం విలువ స్థిరంగా 21.22 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 12.2 మిలియన్ డాలర్లు పెరిగి 4.43 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద ఉన్న నిల్వల పరిస్థితి చూస్తే, ఈ పరిమాణం 46.2 మిలియన్ డాలర్లు పెరిగి 1.90 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ మారకపు నిల్వలు పెరగడం ఇది వరుసగా నాల్గవవారం.