బాహుబలి సమర్పకుడి షోలో జస్టిన్ బీబర్
- పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌తో ‘కాఫీ విత్ కరణ్’
- ముంబై, ఢిల్లీల్లో బీబర్ ఫీవర్..
ముంబై: తన మెస్మరైజింగ్ పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న కెనడియన్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ భారత పర్యటనలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో బీబర్ పాల్గొంటాడని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరగనుంది.
అయితే అదే రోజు(మే 10) ముంబైలోని డీవై పాటిట్ స్టేడియంలో జస్టిన్ ప్రదర్శన ఉండటంతో ఆలస్యంగానైనా టాక్ షో షూట్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ’కాఫీ విత్ కరణ్’లో ఎంతో మంది బాలీవుడ్ స్టార్లను ఇంటర్వ్యూ చేసిన కరణ్.. ఆరో సీజన్‌లో భాగంగా తొలిసారి తన షోలో ఓ అంతర్జాతీయ సెలబ్రిటీకి ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను సందర్శించనున్నాడు.
బీబర్ కోసం సల్మాన్ త్యాగం..
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న సింగర్ జస్టిన్ బీబర్ తొలిసారి ఇండియాకు వస్తుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. ప్రవైవేట్ జెట్ విమానంలో ఇండియాకు చేరుకోనున్న బీబర్..120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. పాప్ సింగర్ అభిరుచి మేరకు ఆయా గదులను లావిష్‌గా ముస్తాబు చేశారు. బీబర్ వెంట 120 కార్లతో భారీ కాన్వాయ్ వెళుతుంది.
ఇకపోతే బీబర్ సెక్యూరిటీ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ త్యాగం చేయాల్సివచ్చింది. కొన్నేళ్లుగా సల్మాన్‌కు బాడీగార్డ్ గా వ్యవహరిస్తోన్న షెరా.. ఈ మూడు రోజులూ జస్టిన్ బీబర్ వద్ద విధులు నిర్వహించనున్నాడు. సల్మాన్ అంగీకారం మేరకే షెరాను బీబర్‌కు బాడీగార్డ్‌గా నియమించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తమ ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాహుబలి-1, 2 హిందీ వెర్షన్‌లను కరణ్ జోహార్ సమర్పించిన సంగతి తెలిసిందే.