
త్యాగాల ఫలితం ఇదేనా!
సాక్షి, కడప: ‘ఎందుకు విభజిస్తున్నారో చెప్పకుండా ప్రకటన చేశారు. సీమాంధ్రులు ఉద్యమిస్తే ఆంటోని కమిటీ వేస్తామన్నారు. కమిటీ ఏం చేస్తుంది? విశాలాంధ్ర కోసం బళ్లారిని కోల్పోయాం. కర్నూలు నుంచి రాజధాని కేంద్రాన్ని కోల్పోయాం..తద్వారా రాయలసీమలో 50ఏళ్ల అభివృద్ధి ఆగిపోయింది. ఇవన్నీ వెనక్కి తెచ్చివ్వగలరా? ఇవన్నీ త్యాగం చేసినందుకు రాయలసీమకు ఇచ్చే బహుమతి ఇదేనా?’ అని కడప వాసులు ముక్తకంఠంతో నినదించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం హరిత ఫంక్షన్‌హాలులో జరిగిన‘ఎవరెటు’ చర్చా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. రాయలసీమ సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని నినదించారు.
సీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కృష్ణాబ్యారేజ్, తుంగభద్ర డ్యాం నిర్మించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ నిర్మించారు. వర్షపు నీటి వనరులు ఉన్న ప్రాంతాలకే సాగునీటి వనరులు కల్పించారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే సీమ ప్రాంతాలకు నీరివ్వలేకపోయారు. పైగా భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కలిసి ఉండాలనే ఏకైక కాంక్షతో తుంగభద్ర డ్యాంను కోల్పోయాం. ఇప్పుడు విడిపోతే కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. ఇదే జరిగితే మిగులుజలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరునగరి, హంద్రీనీవాతో పాటు తెలుగుగంగ, వెలిగొండకు చుక్కనీరు అందదు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. విభజన తప్పదంటే కృష్ణా పరివాహక ప్రాంతాలైన నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంలను కలిపి 16జిల్లాలను ఒక రాష్ట్రంగా.. తక్కిన ఏడుజిల్లాలను మరో రాష్ట్రంగా విభజించాలి’ అని అన్నారు. న్యాయవాది కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలంగాణ అంశంపై గతంలోనే వైఎస్ ఓ లేఖను ఇచ్చారని, అందులో ఓ సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పారన్నారు. చిత్తశుద్ధితో సమైక్యం కోసం ఉద్యమించి ఏ పార్టీకైనా అండగా ఉంటామన్నారు.
ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయపార్టీల నేతలు ప్రజలతో చర్చించకుండా పార్టీల తరఫున లేఖలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కడపలో ఏడేళ్లుగా కలెక్టరేట్ నిర్మించలేదని, రాజధానిని 30ఏళ్లయినా నిర్మించలేరని జయరామయ్య అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. డైట్ అధ్యాపకులు కృష్ణ, న్యాయవాది విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన చర్చలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యాంధ్రనే కొనసాగించాలని ముక్తాయింపు ఇచ్చారు.