
కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే సహించం
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్: కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ మరోపక్క దాడులకు పాల్పడుతున్నారని.. ఇలా వేధిస్తే సహించబోమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చాలా కేసుల విషయంలో నల్లగొండ రూరల్ పోలీసులు, సీఐ పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఇసుక అక్రమ దం దాలో మునిగి తేలుతున్నారని డీఎస్పీ సుధాకర్‌కు శనివారం ఆయన వివరించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ మండలంలోని అప్పాజీపేట గ్రామ సర్పంచ్ భర్త గంగుల సైదులును టీఆర్‌ఎస్ కార్యకర్త చంపుతామని బెదిరించినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, అనంతారంలో కాంగ్రెస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి చేసినా చట్టపరంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కేసుల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించకపోతే లక్ష మందితో హైవేపై ధర్నా చేయడంతోపాటు సీఎంను అసెంబ్లీలో నీలదీస్తామమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్నాయన్నారు. సీఎం యాగాలు, యజ్ఞాలు చేస్తూ కిందిస్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాలను పట్టించుకోకపోతే పుణ్యం కలుగకపోగా పాపం తలుగుతుందన్నారు.