
అఖిలేశ్ ఈసారి ఎవరికి ఝలక్ ఇచ్చాడో తెలుసా?
లక్నో/పాట్నా: సమాజ్‌వాదీ పార్టీని హైజాక్ చేసి తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు గట్టి షాకిచ్చిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా మరో ప్రముఖ వృద్ధ నేతకూ ఝలక్ ఇచ్చారు. ములాయం కుటుంబానికి వియ్యంకుడిగా, యాదవ పరివారం పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అఖిలేశ్‌కు ఫోన్ చేసి ఉచిత సలహా ఇవ్వబోయి భంగపడ్డ ఆ పెద్దమనిషి ఇంకెవరో కాదు ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్! మంగళవారం పొద్దుపోయిన తర్వాత లాలూ.. అఖిలేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
‘చూడుబాబూ.. ఎంతకాదన్నా ఆయన నీ తండ్రి. ఆయన రెక్కల కష్టంతోనే పార్టీ పెద్దదైందని గుర్తుంచుకో. తక్షణమే నేతాజీని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించి, ఆయన చెప్పినట్లు విను..’ అని సలహా ఇచ్చారు. ప్రతిగా అఖిలేశ్ చెప్పిన సమాధానం విని లాలూజీ డంగయ్యారని సన్నిహితులు తెలిపారు. లాలూ ఇచ్చిన సలహాకు థ్యాంక్స్ చెబుతూనే.. ‘మా మంచి కోరే వ్యక్తిగా మీ మాట కాదనకూడదు. కానీ పరిస్థితి చేయిదాటింది. ఎన్నికలు అయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు నావే. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరు క్షణంలో పార్టీ పగ్గాలను సగౌరవంగా నేతాజీ(ములాయం)కి అప్పజెపుతా. అప్పటిదాకా మీరే కాదు.. ఎవరు చెప్పినా వినేదిలేదు’అని అఖిలేశ్ తెగేసి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
(అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?)
తన పోరాటం తండ్రి(ములాయం)పై కాదని, ఆయనను చుట్టుముట్టిన దుష్టశక్తుల(శివపాల్ యాదవ్, అమర్‌సింగ్)పైనేనని అఖిలేశ్ లాలూతో అన్నట్లు తెలిసింది. పార్టీపై పూర్తి పట్టు సాధించిన తరుణంలో ఒకవేళ మళ్లీ నేతాజీకి పగ్గాలు అందిస్తే, ఆయన బలంగా నమ్మే శివపాల్ యాదవ్, అమర్ సింగ్‌లు మళ్లీ బలం పుంజుకుంటారని, తద్వారా పార్టీకి చేటు జరుగుతుందని అఖిలేశ్ నమ్ముతున్నారు. ప్రస్తుత తరుణంలో ములాయంలేని పార్టీకి మనుగడలేదని తెలుసుకాబట్టే అఖిలేశ్.. తండ్రిని మాత్రమే గౌరవిస్తూ ఆయన చుట్టూఉన్నవారిని టార్గెట్‌చేశారు. ఇటు ములాయం కూడా కొడుకువైపే ఉన్నట్లు ఇటీవల ప్రకటనలతో తేలిపోయింది.
(‘సైకిల్’పై 13న స్పష్టత!)