
తాజ్ మహల్ వద్ద ప్రేమజంట కలకలం
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ వద్ద ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ ప్రేమజంట బుధవారం సాయంత్రం తాజ్ మహల్ వద్ద ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడంతో పర్యాటకులు షాక్ కు గురైయ్యారు. డెహ్రాడూన్ కు చెందిన రాజవీర్ సింగ్(25), ఆగ్రాలోని కర్బాలా నివాసి షబ్నం అలీ బ్లేడులతో పరస్పరం గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు.
రక్తపు మడుగులో పడివున్న వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఎస్ ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషంగా ఉన్నట్టు సమాచారం. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించలేదన్న కారణంతో వీరు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. తీవ్ర నిస్పృహతోనే ఆత్మహత్యకు యత్నించామని ఆస్పత్రిలో ఆగ్రా మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో రాజవీర్ సింగ్ తెలిపాడు. తమ పెళ్లికి పెద్దలను ఒప్పించడంలో తామిద్దరం విఫలమయ్యామని చెప్పాడు. ఇద్దరీ మతాలు వేర్వేరు కావడం తమ పెళ్లికి అడ్డుగోడగా మారిందని వాపోయాడు.
తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందన్న వార్త వినగానే షబ్నం తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రేమించిన వాడితో ఆమెకు పెళ్లి జరిపించేందుకు ఒప్పుకుంటున్నట్టు వైద్యులకు తెలిపారు. కాగా, రాజవీర్-షబ్నంపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.