
బీజేపీకి ఊహించని మద్దతు!
న్యూఢిల్లీ: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం మార్చారు. కమలం పార్టీకి స్నేహహస్తం అందించారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే మద్దతు ఇస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. అద్వానీని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నట్టు బెంగాల్ టీవీ చానల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెట్టినా మద్దతుయిస్తామని చెప్పారు. జూలై 24న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ అభ్యర్థిగా అద్వానీని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ ఎందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోర్టుకు వెళ్లాలని సూచించారు. 2019 సాధారణ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారద స్టింగ్ ఆపరేషన్ బీజేపీ కుట్ర అని మమత ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వాపోయారు.