వర్సిటీలపై మావోయిస్టుల గురి! | Maoists focus on Universities | Sakshi
Sakshi News home page

వర్సిటీలపై మావోయిస్టుల గురి!

Published Fri, Sep 25 2015 1:53 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

వర్సిటీలపై మావోయిస్టుల గురి! - Sakshi

వర్సిటీలపై మావోయిస్టుల గురి!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేజిక్కించుకునే దిశగా మావోయిస్టులు అడుగులు వేస్తున్నారా...  అటు కేడర్‌ను పెంచుకోవడంతోపాటు ఇటు టెక్నాలజీని పొందేలా  ఇంజనీరింగ్ విద్యార్థులను చేర్చుకోవడంపై దృష్టిపెట్టారా..? ఈ ప్రశ్నలకు నిఘావర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణలో కేడర్‌ను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న మావోయిస్టు పార్టీ... పౌర సమాజంలో ఉండి తమకు మద్దతు పలకడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వారి సహకారం తీసుకోవాలని గతేడాది నవంబర్‌లో జార్ఖండ్‌లో జరిగిన ప్లీనరీలో నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అనుగుణంగానే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల సహకారం తీసుకునే దిశగా అడుగులు వేసింది. ఉద్యమంపై సానుభూతి ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారికి ఆర్థిక సమస్యలు లేకుండా తగిన పారితోషికం అందించాలనేది వారి వ్యూహం. ఇందుకోసం పౌరసమాజంలో ఉన్న ఉద్యమ నేతలు, సానుభూతిపరుల సహాయం తీసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ, జేఎన్టీయూ (హైదరాబాద్, మంథని, జగిత్యాల) కాలేజీల నుంచి 75 మంది విద్యార్థులను గుర్తించి వారి సహకారం కోరింది.

కాలేజీల సమీపంలోనే షెల్టర్లను ఏర్పాటు చేసుకుని సానుభూతిపరుల ద్వారా కార్యకలాపాలు సాగించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోం శాఖకు ఈ విషయాలను వెల్లడించింది. ‘మావోయిస్టు పార్టీ రెండు దశలుగా కేడర్‌ను విస్తరించుకునే వ్యూహంతో వెళుతోంది. పూర్తిగా ఉద్యమంలో మమేకమై, ఉద్యమ విస్తృతి కోసం పనిచేసేవారిని నియమించుకోవడం ఒకటైతే, పౌర సమాజంలోనే ఉంటూ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేలా ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారం తీసుకోవడం రెండోది.

రాయ్‌పూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు వైర్‌లెస్ సెట్ల పనితీరుపై అధ్యయనం చేయడం ద్వారా మావోయిస్టు పార్టీకి సహకారం అందించినట్లు సమాచారం అందింది. ఈ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలంగాణలోనూ ఇలాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయని వెల్లడైంది..’ అని ఛత్తీస్‌గఢ్ తన నివేదికలో పేర్కొంది.
 
ఏడాది నుంచి..
మావోయిస్టు పార్టీ కేడర్‌ను పెంచుకునే కార్యక్రమాన్ని గతేడాది నవంబర్‌లోనే ప్రారంభించిందని, ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ దృష్టికి తీసుకువెళ్లామని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోంశాఖకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ కేంద్రంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో విద్యార్థులను నియమించుకుందని...వెల్లడించింది.

‘కరీంనగర్ జిల్లాకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని, వారి తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆ జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించింది. దీన్ని వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు విశ్వవిద్యాలయాలు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులపై నిఘా పెంచారు. అప్పటి నుంచి రిక్రూట్‌మెంట్ దాదాపుగా నిలిచిపోయింది..’ అని ఐబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇటీవల వరంగల్ జిల్లాలో జరి గిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి సాంకేతిక విద్యార్థుల సహకారం కోసం పని చేసిందన్నది ఐబీ దగ్గర ఉన్న సమాచారం. ఈ ఏడాది ఆగస్టులోనే శ్రుతి కార్యకలాపాలను తెలంగాణ నిఘావర్గాలు పసిగట్టాయి. ఆమెకు ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో దర్యాప్తు జరిగిందని ఐబీ వర్గాలు పేర్కొన్నాయి.
 
వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
మావోయిస్టు ఉద్యమంలో చేరిన విద్యార్థుల ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల వారీగా మావోయిస్టు సానుభూతి పరుల జాబితాను రూపొందించి వారెక్కడ ఉన్నారన్నదానిపై విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన కొందరు విద్యార్థులను గుర్తించారు. వారిలో అత్యధికులు ఇష్టం లేక తిరిగి వచ్చేసినవారేనని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. ‘వారు (మావోయిస్టులు) ఎంత ప్రయత్నించినా కేడర్ దొరకడం కష్టం. విద్యార్థులు, నిరుద్యోగులు కెరీర్, ఉద్యోగావకాశాల మీద దృష్టి సారిస్తున్నారు. తెలియక వెళ్లిన కొద్ది మంది కూడా అనతి కాలంలోనే తిరిగి బయటకు వస్తున్నారు..’ అని అధికారి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement