ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం తెలిపింది.
పంజగుట్ట(హైదరాబాద్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం తెలిపింది. అదే విధంగా నేటి నుంచి అన్ని గ్రామ, మండల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది.
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ... గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఎన్నో సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. గ్రామంలో సర్పంచ్, వైస్ సర్పంచ్, ఆఖరుకు వార్డు సభ్యులకు కూడా స్థానం కల్పించి తమను మాత్రం విస్మరించారని తెలిపారు.
తమను ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా గుర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,473 మంది ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈనెల 22న జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారని కరుణాకర్ తెలిపారు.