బెంగళూర్:బీజేపీలో రాజుకున్న వారణాసి లోక్ సభ సీటు అంశం కొలిక్కి వచ్చినట్లు కనిపించినా ఇంకా పూర్తిగా మాత్రం సమసిపోలేదు. నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీకి దిగుతారనే వార్తల నేపథ్యంలో ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురళీ మనోహర్ జోషీకి అసహనం కల్గిస్తోంది. ఆ స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారా?లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉండగానే..జోషీ మాత్రం తీవ్ర నిరాశకు లోనైయ్యారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జోషీ తాను అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన పాపమని జోషీ పేర్కొన్నారు.
వారణాశి నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ ప్రాతినిధ్యం వహిస్తున్నక్రమంలో నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే వార్తలు రావడంతో జోషీ అలకబూనారు. దీనికి తోడు బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల రెండు జాబితాల్లో జోషీ పేరు లేకపోవడంతో ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. వారణాశి అభ్యర్థి ఎవరన్న విషయం బీజేపీలో విభేదాలకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటే ఇదేమంత పెద్ద సమస్య కాబోదు. పైగా మోడీ, జోషీలిద్దరూ ఆర్ఎస్ఎస్కు అత్యంత ప్రీతిపాత్రులు. వారణాశి సీటు కోసం మోడీ, జోషీ పోటీపడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్ఎస్ఎస్ గత రెండు రోజుల క్రితం తెలిపింది. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ తప్పక పడుతుందని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.కాగా , గుజరాత్ రాష్ట్రంలోని లోక్ సభ సీటు నుంచి మాత్రమే పోటీ చేస్తారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం తెలిపింది. దీంతో ఈ సమస్యకు ప్రస్తుతానికి తెరపడినా..జోషీ మాత్రం రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు.