
నవ్వుపుట్టిస్తోన్న టీడీపీ తురుపుముక్కలు
- హస్తం గుర్తుకు ఓటేయాలన్న జలీల్ ఖాన్!
- చెప్పుకోవడానికేమీలేక కమెడియన్లతో షో నడిపిస్తోన్న చంద్రబాబు
నంద్యాల: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నంద్యాలలో పార్టీల ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. కాగా, అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టీడీపీ తురుపుముక్కలు.. స్థానిక ప్రజలకు ఒకింత హాస్యాన్ని పంచుతున్నారు.
‘బీకాంలో ఫిజిక్స్’ చదివిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. అయితే టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ‘హస్తం గుర్తుకు ఓటేయండ’ని జలీల్ కోరడంతో అక్కడున్న జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారని తెలిసింది.
బాబు షో: శనివారం నంద్యాలలో రోడ్ షో నిర్వహించిన సీఎం చంద్రబాబు వేణుమాధవ్ తదితర కమెడియన్లను వెంటపెట్టుకురావడం తెలిసిందే. అయినంతలో వాళ్లు కూడా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేయగా, ప్రజలు మాత్రం టీడీపీ తీరుపై పెదవివిరిచారు. ‘‘మూడున్నర ఏళ్లలో ప్రజలను మోసం చెయ్యడం తప్ప చంద్రబాబు చేసిందేమీలేదు. అందుకే చెప్పుకోవడానికి ఏమీలేక కమెడియన్లతో షో చేస్తున్నారు’’ అని జనం బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆగస్టు 23న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.