
రాజకీయ అస్పృశ్యతను నిర్మూలించాలి
కేవాడియా(గుజరాత్): రాజకీయ అస్పృశ్యతను నిర్మూలించాల్సిన సమయం వచ్చిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ‘అసృ్పశ్యత నిర్మూలనకు మహాత్మాగాంధీ జీవితాంతం కృషిచేశారు. ఇప్పుడది రాజకీయాల్లోకి వచ్చి చేరింది. ఈ రాజకీయ అంటరానితనాన్ని నిర్మూలించాల్సిన సమయమొచ్చింది’ అన్నారు. గోధ్రా అల్లర్లను చూపుతూ.. మోడీని చాలా పార్టీలు రాజకీయంగా దూరం పెడ్తున్న నేపథ్యంలో.. మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని నర్మద డ్యామ్ దగ్గరలో భారత ప్రథమ ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ మరోసారి పటేల్ వారసత్వ అంశాన్ని లేవనెత్తారు. పటేల్ లౌకికవాది అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఆయనది ఓట్‌బ్యాంక్ లౌకికవాదం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రెండ్రోజుల క్రితం గుజరాత్‌లో సర్దార్ పటేల్ పేరున ఏర్పాటుచేసిన మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల మధ్య పటేల్ విషయంపై ఎత్తిపొడుపుల ఉదంతం జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ ప్రధాని పటేల్ అయ్యుంటే దేశ ముఖచిత్రం వేరేలా ఉండేదన్న మోడీ వ్యాఖ్యకు.. పటేల్ నిజమైన లౌకికవాది, జీవితాంతం కాంగ్రెస్‌వాదిగానే ఉన్నారంటూ ప్రధాని స్పందించిన విషయం కూడా తెలిసిందే. ఆ రోజునాటి ప్రధాని వ్యాఖ్యలపై మోడీ గురువారం స్పందించారు. ‘నిజమే. పటేల్ లౌకికవాది అన్న ప్రధాని వాదనను మేమూ ఒప్పుకుంటాం. అయితే, పటేల్ ఆచరించిన లౌకికవాదం సోమ్‌నాథ్ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే సెక్యులరిజం కాదు. పటేల్ లౌకికవాదం దేశాన్ని విభజించేది కాదు.. దేశాన్ని ఐక్యపరిచేది. పటేల్‌ను ఏ ఒక్క పార్టీకో సంబంధించిన వారనడం ఆయనను అవమానపర్చడమే. ఆయన గొప్పదనం దేశ చరిత్రతో అనుసంధానించతగ్గది’ అన్నారు.
అయితే, ఆయన సేవలకు చరిత్రలో తగిన స్థానం దక్కలేదన్నారు. పటేల్ ప్రసంగ రికార్డును కార్యక్రమంలో వినిపించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘సర్దార్ స్వరాన్ని చాలా సంవత్సరాలు నొక్కిపట్టి ఉంచారు. ఇక్కడికొచ్చిన చాలా మంది ఆయన గొంతును మొదటిసారి వింటున్నారు కావచ్చు’ అని నెహ్రూ, గాంధీ వారసత్వ రాజకీయాలపై మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభావంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియాలో పటేల్ జయంతి ప్రకటనలు కనిపిస్తున్నాయన్నారు. సంప్రదాయంగా బీజేపీకి దూరంగా ఉండే ముస్లింలు, దళితులకు దగ్గరయ్యేందుకు మోడీ ప్రయత్నించారు. ఐక్యతారాగాన్ని పదేపదే వినిపించడంతో పాటు, అంబేద్కర్ సేవలను కొనియాడారు. ప్రధానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సర్దార్ సరోవర్ డ్యామ్‌కు గేట్లను ఏర్పాటు చేయడం లేదని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. అద్వానీ తన ప్రసంగంలో మోడీని మరోసారి ప్రశంసించారు. ప్రపంచంలోనే ఎత్తై పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన మోడీని అభినందిస్తున్నానన్నారు. మరోవైపు, పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించేందుకు బీహార్ వస్తున్న మోడీని రాష్ట్ర ప్రభుత్వ అతిధిగా గౌరవిస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం సేవలందిస్తామని పేర్కొంది.
పటేల్‌ది మానవత్వం .. మోడీది అహంకారం: కాంగ్రెస్
బీజేపీ, కాంగ్రెస్ మధ్య పటేల్ వారసత్వ యుద్ధం తీవ్రమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం పటేల్ పేరును మోడీ వాడుకుంటున్నాడని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అన్యాపదేశంగా 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. 1947 దేశ విభజన సమయంలో పటేల్ వేలాది ముస్లింలను కాపాడారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ మానవత్వానికి ప్రతీక అయితే.. మోడీ స్వాతిశయానికి, అహంకారానికి ప్రతీక అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ట్వీట్ చేశారు. పటేల్ నిరాడంబర జీవన విధానాన్ని.. మోడీ ధరించే డిజైనర్ దుస్తులు, బ్రాండెడ్ కళ్లజోళ్లతో పోల్చి ఎద్దేవా చేశారు.