భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పై ప్రధాని ఆసక్తి
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దాయాది జట్ల మధ్య క్రికెట్ పోటీ జరగాలని షరీఫ్ ఆకాంక్షిస్తున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. అయితే టీమిండియాతో భారత్ లో సిరీస్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడ్డారని చెప్పారు.
శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. క్రికెట్ అభిమానిగా రెండు దేశాల జట్ల మధ్య సిరీస్ జరగాలని షరీఫ్ చాలా చొరవ చూపారని అన్నారు. క్రికెట్ ను ఆటగానే చూడాలని, యుద్ధంలా కాదని షరీఫ్ పేర్కొన్నారని చెప్పారు. భారత్ తో సంబంధాలు త్వరలోనే మెరుగవుతాయన్న ఆశాభావంతో ఆయన ఉన్నారని వెల్లడించారు.