అది మనందరి తప్పు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ’మన్‌కీ బాత్’లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం మంచి విషయమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. గతవారం జమ్ముకశ్మీర్ ప్రతిపక్ష నేతలతో భేటీ అనంతరం తొలిసారి ఈ అంశంపై మోదీ మాట్లాడారని, ఇప్పుడు ’మన్‌కీ బాత్’లోనూ దీనిని కొనసాగించారని ట్విట్టర్‌లో తెలిపారు.
’అది యువత కానివ్వండి, భద్రతాసిబ్బంది కానివ్వండి కశ్మీర్‌లో ఎవరూ చనిపోయినా అది మనందరికీ నష్టమే’ అంటూ మోదీ పేర్కొన్న వ్యాఖ్యను ఒమర్ ట్వీట్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ఇక, ’కశ్మీర్‌లో యువతను హింసవైపు ప్రేరేపిస్తున్న వారు ఒకరోజున వారికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంద’న్న మోదీ వ్యాఖ్యకు సమాధానంగా మరో ట్వీట్ చేస్తూ.. ’సర్.. దురదృష్టవశాత్తు మనందరి ఉమ్మడి తప్పులు, జమ్ముకశ్మీర్ అంశాన్ని సరిగ్గా పరిష్కరించకపోవడం వల్ల యువత ఇలా హింస వైపు మళ్లుతున్నారు’ అని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో గత 51 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 70మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
Unfortunately sir a lot of these youngsters have been pushed there by our collective mistakes & mishandling of J&K. https://t.co/MoOrITSBoQ
— Omar Abdullah (@abdullah_omar) August 28, 2016