మహేశ్‌బాబుకు బాలయ్య సవాల్!
-
స్పైడర్‌కు పోటీగా పైసా వసూల్
-
ఒక్క రోజు తేడాతో విడుదల
హైదరాబాద్: వయస్సు మీద పడుతున్నా నందమూరి బాలకృష్ణ ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. యువ హీరోలతో పోటీపడి మరి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ విజయాలు సాధిస్తూనే ఉన్నారు. గత సంక్రాంతి బరిలో జూనియర్ ఎన్టీఆర్ ’నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలతో పోటీపడి ’లెజండ్’ సినిమాను తీసుకొచ్చారు బాలయ్య. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈసారి కూడా బాలయ్య అలాంటి ప్రయోగమే చేయబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న బాలయ్య తాజా సినిమా ‘పైసా వసూల్’... బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఈ చిత్ర బృందం శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో ముచ్చటించింది. పోర్చుగీస్ నుంచి సాగిన లైవ్ చిట్‌చాట్‌లో ‘పైసావసూల్’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
అంటే మహేశ్‌బాబు సినిమా ‘స్పైడర్’కు గట్టిపోటీగా బాలయ్య ‘పైసా వసూల్’ బాక్సాఫీస్ బరిలో దూకబోతున్నది. మురగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహేష్ సినిమా ‘స్పైడర్’ తెరకెక్కుతున్న సంగతి. విడుదల అప్పుడు-ఇప్పుడు అంటూ ఊరిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అన్ని కుదిరితే ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన రెండోనాడే బాలయ్య ‘పైసా వసూల్’ వస్తుండటంతో ఒక్క రోజు తేడాలో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఈ రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో వస్తున్నాయంటే ఇద్దరు హీరోల అభిమానులకు పండుగేనని సినీ జనాలు అంటున్నారు.