ఐదుగురికి గాయాలు
బీఎస్‌ఎఫ్ ఈద్ మిఠాయిలను
నిరాకరించిన పాక్ రేంజర్లు
జమ్మూ: సరిహద్దులో ఉద్రిక్తత మరింత పెరిగింది. శుక్ర, శనివారాల్లో పాకిస్తాన్ బలగాలు జమ్మూక శ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్ సెక్టార్లలో మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్‌లో రెండు గ్రామాలపై జరిపిన కాల్పులు, మోర్టారు బాంబు దాడుల్లో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారు. గత నాలుగు రోజుల్లో పొరుగు దేశం కాల్పుల విరమణకు గండికొట్టడం ఇది ఆరోసారి. పూంచ్ సెక్టార్‌లోని జోత్రియన్, కస్బా గ్రామాలపై పాక్ సైన్యం శనివారం పలు గంటలపాటు భారీగా మోర్టార్ బాంబులు ప్రయోగించి, కాల్పులు జరిపిందని, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సరిహద్దు ప్రజలు ఈద్ పర్వదినం జరుపుకుంటున్నా పట్టించుకోకుండా పాక్ దుశ్చర్యకు పాల్పడిందన్నారు. క్షతగాత్రులను పూంచ్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పాక్ కాల్పులకు తమ సైన్యం దీటుగా జవాబిచ్చిందని, ప్రజలు ఈద్ జరుపుకుంటుండడంతో కాల్పులను తీవ్రం చేయలేదని వివరించారు. రాజౌరీలోని నౌషేరా సెక్టార్‌లో భారత ఆర్మీ స్థావరాలపై పాక్ సైన్యం శనివారం రాత్రి 9.25 గంటల నుంచి 11.45 వరకు కవ్వింపు లేకుండానే కాల్పులు జరిపిందని, తమ సైన్యం వాటిని దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దులో స్వీట్లు ఇవ్వలేదు
అమృత్‌సర్‌లోని అత్తారీ-వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ఈద్ పండుగ సందర్భంగా ఇచ్చిన మిఠాయిలను తీసుకోవడానికి పాక్ రేంజర్ల్ నిరాకరించారు. దీంతో పండుగనాడు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘనకు నిరసనగా ఈసారి అంతర్జాతీయ సరిహద్దులోని ఆ దేశ జవాన్లకు తాము మిఠాయి ఇవ్వలేదని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
‘ఆ ద్రోన్ చైనాలో తయారైంది..’
పాక్ సైన్యం ఇటీవల ఆ దేశ భూభాగంలో కూల్చేసిన ద్రోన్ చైనాలో తయారైందని చైనా అధికార పత్రిక పీపుల్ డైలీ తెలిపింది. భారత్‌కు చెందిన నిఘా ద్రోన్‌ను కూల్చేశామని పాక్ ఇటీవల చెప్పడం, అది తమది కాదని భారత్ ప్రకటించడం తెలిసిందే.
కశ్మీర్ లోయలో పాక్ జెండాలు
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శనివారం ఈద్ ప్రార్థనల అనంతరం నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించగా ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడ్డారు. కశ్మీర్ లోయలో పలుచోట్ల్ల శనివారం వేర్పాటువాదులు పాక్ జెండాలను ఎగరేశారు.
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
Published Sun, Jul 19 2015 1:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement