ఇక ఒక్కరోజులోనే పాన్ కార్డు!
న్యూఢిల్లీ : డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ దాఖలుతో ఇక కంపెనీలు కేవలం ఒక్క రోజులోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్లను పొందనున్నాయి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం చర్యలు ప్రారంభించేసింది. పాన్, టాన్ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలను ప్రారంభించినట్టు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. అదేవిధంగా సాధారణ వ్యక్తులు కూడా పాన్ను తేలికగా.. తక్కువ సమయంలో పొందేందుకు ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
పాన్ కార్డును, టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్(టాన్)ను కంపెనీలకు త్వరగా అందించడానికి ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్, యూటీఐఐటీఎస్ఎల్ లాంటి పాన్ సర్వీసు ప్రొవైడర్స్ కు డిజిటల్ సంతక ఆధారిత అప్లికేషన్ ను ప్రవేశపెట్టినట్టు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ కొత్త ప్రక్రియతో ఆన్ లైన్ లో అప్లికేషన్ ను నమోదుచేసిన ఒక్క రోజులోనే పాన్, టాన్ లను కంపెనీలకు అందిస్తామని పేర్కొంది.
అదేవిధంగా సాధారణ అప్లికెంట్స్ కు కూడా ఆధార్ ఆధారిత అప్లికేషన్ ప్రక్రియను పాన్ సర్వీసు ప్రొవేడర్లు ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్ ద్వారా అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఆధార్ ఆధారితంగా సాధారణ వ్యక్తులకు జారీచేసే పాన్ సర్వీసులతో, పేపర్ లెస్ అప్లికేషన్ ప్రక్రియను ఉచితంగా అందించడమే కాక, డ్యూప్లికేట్ పాన్ సమస్యను అధిగమించవచ్చని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. ఈ అప్లికేషన్ల యూఆర్ఎల్ లింక్స్ డిపార్ట్ మెంటల్ వెబ్సైట్ ఇన్కమ్టాక్స్ఇండియా.గవర్నమెంట్.ఇన్ లోని హోమ్ పేజ్ పై "ఇంపార్ట్టెంట్ లింక్స్"లో అందుబాటులో ఉండనున్నాయి..