న్యూ ఇయర్కి మరో బాంబు పేల్చనున్నారా?
న్యూఢిల్లీ: నవంబర్ 8 వ తేదీ రాత్రి 8 గంటలకు హఠాత్తుగా నోట్ల రద్దును ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి సమావేశంలో మరో బాంబు పేల్చనున్నారా? నల్లకుబేరులకు, అక్రమార్కులకు రానున్నది కష్టకాలమే అన్న ఇటీవల హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 31నాటి సమావేశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. నూతన సంవత్సరంలో ప్రధాని దేశ ప్రజలకు ఎలాంటి వార్తను అందించనున్నారు?
పాత నోట్ల డిపాజిట్లకు సమయం శుక్రవారంతో ముగియనుండడంతో మానిటైజేషన్ తరువాతి రోడ్ మ్యాప్ పై మళ్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. శుక్రవారం లేదా శనివారం ప్రసంగిస్తారా అనేది పూర్తిగా స్పష్టత లేనప్పటికీ పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు, దేశంలో ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అలాగే డీమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వ రోడ్ మ్యాప్ పై మళ్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలనుద్దేశించి 50రోజుల గడువు ఇవ్వండని విజ్ఞప్తి చేసిన ప్రధాని ఈ సారి ఏ ప్రకటన చేస్తారోననే సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భారీ ప్రచారం నిర్వహించేందుకు కేంద్రం సంసిద్దమవుతోంది. దీనికి మంత్రులను కూడా సన్నద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి 60 పేజీల డాక్యుమెంట్ ను మంత్రులందరికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే పంపిణీ చేసింది. ఇందులో పెద్దనోట్ల రద్దు కు సంబంధించిన ప్రతీ అంశాన్నీ పాయింట్ టు పాయింట్ చేర్చినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా డీమానిటైజేషన్ అనంతరం దేశ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొన్న ఇబ్బందుల పరిష్కారానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలగురించి కూడా మోదీ వివరించవచ్చు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిణామాలు, 50 రోజులు గడిచినా ఇంకా తీరని నోట్ల కొరత, దీని పరిష్కారానికి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించారో తేలనుంది. కాగా మంగళవారం ప్రధాని ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిపై చర్చించేందుకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.