మోదీ ఏపీ పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వాయిదాపడింది. జులై 15,16 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , బీజేపీ పాలిత 13 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల సహా దాదాపు 250 మంది బీజేపీ ఆగ్రనేతలు పాల్గోనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకొకసారి జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ సారి విశాఖపట్నంలో నిర్వహించాలని భువనేశ్వర్‌లో జరిగిన గత సమావేశాల్లో పార్టీ నిర్ణయించింది.
అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో జులై 15, 16వ తేదీల్లో విశాఖలో జరగాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తాత్కాలిక వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయించినట్టు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. హరిబాబు శనివారం వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిపై పోటీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడడం.. రాష్ట్రపతి ఎన్నికకు జులై 17వ పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన నేపధ్యంలో కార్యవర్గ సమావేశాలను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు ముందుగా అనుకున్నట్టు విశాఖపట్నంలోనే కొనసాగుతాయని పార్టీ పేర్కొనగా, సమావేశాలు జరిగే తేదీలను పార్టీ తిరిగి ప్రకటించాల్సి ఉంది.