గుజరాత్ నుంచి కాంగ్రెస్ తరపున పెద్దల సభకు బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీః గుజరాత్ నుంచి కాంగ్రెస్ తరపున పెద్దల సభకు బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలోకి క్యూ కడుతున్న క్రమంలో తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రపుల్ పటేల్ వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కలవరపెడుతున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనేదానిపై తమ పార్టీ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రపుల్ పటేల్ వ్యాఖ్యానించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసింది. గుజరాత్ శాసనసభలో ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.
గుజరాత్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపికవనుండగా వారిలో బీజేపీ నుంచి అమిత్ షా, స్మతీ ఇరానీలు సులభంగా ఎన్నికవనున్నారు. మూడో అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తిరిగి బరిలో నిలిచిన అహ్మద్ పటేల్‌కు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సీనియర్ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ గెలువాలంటే ఎన్సీపీ మద్దతు కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది.