
దశలవారీ ఉపసంహరణ
సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా: సంక్షోభాల కారణంగా అసాధారణ ద్రవ్య విధానాలను పాటిస్తున్న సంపన్న దేశాలు.. వాటిని క్రమపద్ధతిలో ఉపసంహరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. తద్వారా వర్ధమాన దేశాల వృద్ధి అవకాశాలు దెబ్బ తినకుండా చూడాలని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. 8వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌కి బయలుదేరే ముందుగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రధాన ఎకానమీల మధ్య విధానపరమైన సమన్వయం పెరిగేట్లుగా జీ20 కూటమి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.
సంపన్న దేశాలు వృద్ధి చెందుతున్నట్లుగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. నిధులు తరలిపోతుండటం వల్ల వర్ధమాన దేశాలు ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. వర్ధమాన దేశాలు నిలకడగా అభివృద్ధి చెందేందుకు, ప్రపంచ వృద్ధికి తోడ్పడేందుకు జీ20 కూటమి.. ఉపాధి కల్పన, ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు ఊతమివ్వడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను కూడా సంస్కరించాల్సి ఉందని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
ఎంఎన్‌సీలపై ‘పన్ను’ సాధింపు లేదు..
వివిధ దేశాలు తమకు రావాల్సిన పన్ను ఆదాయం కోల్పోకుండా చూసేందుకు కొత్త ప్రమాణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం చెప్పారు. ఈ విషయంలో భారత్.. బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీ)పై ప్రత్యేకంగా సాధింపు చర్యలేమీ తీసుకోవడం లేదన్నారు. ఎంఎన్‌సీలు తాము కార్యకలాపాలు సాగించే దేశాల్లో నిబంధనలకు అనుగుణంగా పన్నులు కట్టాల్సిందేనని మాయారాం తెలిపారు. రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) చెబుతున్నట్లుగా వచ్చే ఒకటి, రెండు సంవత్సరాల్లో భారత్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు లేవని మాయారాం స్పష్టం చేశారు. అసలు ఎస్‌అండ్‌పీ ఏ గణిత సూత్రాల ఆధారంగా ఇలాంటి నిర్ధారణకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.