
ప్రైవేటు విద్య అనాగరికం:ప్రొ..హరగోపాల్
ప్రైవేటు విద్య అనాగరికమని సామాజిక వేత్త ప్రొ.హరగోపాల్ అన్నారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మహాసభ రెండో రోజు శుక్రవారం ‘నయా ఉదార విధానాలు విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది.
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మహాసభలో ప్రొ.హరగోపాల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రైవేటు విద్య అనాగరికమని సామాజిక వేత్త ప్రొ.హరగోపాల్ అన్నారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మహాసభ రెండో రోజు శుక్రవారం ‘నయా ఉదార విధానాలు విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ టెక్సాస్ అధ్యక్షత వహించగా ప్రొ. హరగోపాల్, ప్రొ.రమామెల్కొటే, ప్రొ.నాగేశ్వర్ వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో 300 ప్రైవేటు విద్యా సంస్థలు నడిపిస్తున్న వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరు దేశంలోకి విదేశీ వర్సిటీల ప్రవేశం కోసం యత్నిస్తున్నారని తెలిపారు.
ప్రైవేటు విద్య వల్ల మానవతావాదులు కాకుండా వ్యాపార ధోరణి గల వ్యక్తులు తయారవుతారని చెప్పారు. కామన్ స్కూల్, నైబర్ స్కూల్ విద్యా విధానం కోసం పోరాడాలన్నారు. ఉన్నత విద్య బలోపేతానికి వర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయ్యన్న, అధ్యక్షులు అలీ ఉల్లా ఖాద్రీ, సహాయ కార్యదర్శి స్టాలిన్, జాతీయ అధ్యక్షులు పరంజీత్ ధాబా, కార్యదర్శి లెనిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.