సింగరేణి పాలిటెక్నిక్‌లో ర్యాగింగ్ | Raging in the Polytechnic Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణి పాలిటెక్నిక్‌లో ర్యాగింగ్

Published Wed, Aug 19 2015 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

Raging in the Polytechnic Singareni

జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి
ఏడుగురిని సస్పెండ్ చేసిన  కాలేజీ యాజమాన్యం

 
శ్రీరాంపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీకి ర్యాగింగ్ భూతం పట్టింది.  ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి సీసీసీ నస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. సీసీసీలోని పాలిటెక్నిక్ కళాశాల సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తోంది.  ఈ నెల 2న జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. కోపంతో జూనియర్ విద్యార్థి అక్కడే ఉన్న ట్రంక్ బాక్సును కాలితో తన్నాడు. ట్రంకు బాక్సుకు సంబంధించిన విద్యార్థి, జూనియర్  మధ్య మాటలు పెరిగాయి.  విషయం తెలుసుకున్న సీనియర్లు వచ్చి జూనియర్ విద్యార్థిపై హాస్టల్ గదిలోనే దాడి చేశారు. సీనియర్లంటే భయంలేదా? అంటూ కొట్టారు.

ఈ దాడిలో మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. దాడికు గురైన విద్యార్థి ఈ ఘటనను ఎవరికీ చెప్పలేదు. మిగితా విద్యార్థులు కూడా భయపడి ఎవరికి చెప్పలేదు. దెబ్బలు తిన్న ఆ విద్యార్థికి జ్వరం రావడంతో ప్రిన్సిపల్ అనుమతితో ఈనెల 14న గోదావరిఖనిలోని తన ఇంటికి వెళ్లాడు. తండ్రికి 2వ తేదీన జరిగిన ర్యాగింగ్ గురించి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు సోమవారం సీసీసీ నస్పూర్ పోలీసులకు దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. తరువాత కాలేజీ ప్రిన్సిపల్ రామారావును కూడా కలిసి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రమే ఎస్సై ప్రమోద్‌రావు కాలేజీకి వచ్చి విచారించారు. ఈ ఘటనే కాకుండా తనతో సీనియర్ విద్యార్థి ఒకరు బట్టలు ఉతికించారని ఓ జూనియర్ వాపోయాడు. పలుసార్లు ర్యాగింగ్ చేశారని తెలిపాడు.
 
ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు..
ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. ర్యాగింగ్‌కు పాల్పడినందుకు మొత్తం ఏడుగురు విద్యార్థులను 10 రోజులపాటు కాలేజీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. కాలేజీలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నామని ప్రిన్సిపాల్ డి.రామారావు తెలిపారు. హాస్టల్‌లో సీసీ కెమెరాలు కూడా పెట్టామని, కేర్ టేకర్‌తోపాటు సెక్యూరిటీ గార్డును కూడా పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మారో మారు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement