'ప్రాణాలతో వెళ్లవని బెదిరించాడు'
న్యూఢిల్లీ: అఖిలేశ్‌పై తాను చేసిన ప్రశంసలు తేనెపూసిన మాటలు కావని బహిష్కృత నేత అమర్‌సింగ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో పునరాగమనం కోసం తాను అఖిలేశ్‌ను పొగడ లేదని చెప్పారు. సైకిల్ గుర్తును ఎన్నికల కమిషన్(ఈసీ) అఖిలేశ్‌కు కేటాయిస్తూ చేసిన ప్రకటన అనంతరం అమర్‌సింగ్ అఖిలేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. పార్టీలో ముసలానికి కారణం అఖిలేశేనని అమర్‌సింగ్ గతంలో విమర్శించారు.
పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం బాధను కలిగించిందని ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన తర్వాతి నుంచి రామ్‌గోపాల్ యాదవ్ తనను ఓడిపోయిన పోట్లగిత్తలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తనను చంపేస్తానని పలు మార్లు రామ్‌గోపాల్ యాదవ్ బెదిరించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాణాలతో వెళ్లలేవని రామ్‌గోపాల్ యాదవ్ అన్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన అమర్‌సింగ్‌కు ఈ మధ్య కాలంలోనే భద్రతను జెడ్ కేటగిరీకి పెంచారు. కేంద్ర రక్షణా సంస్ధల ఆదేశాల మేరకే అమర్‌సింగ్‌కు భద్రతను పెంచినట్లు ఓ అధికారి తెలిపారు.