రిజర్వుబ్యాంకు నూతన గవర్నర్ రఘురామ్ రాజన్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.
ముంబై: రిజర్వుబ్యాంకు నూతన గవర్నర్ రఘురామ్ రాజన్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ అభివృద్ధికి బ్యాంకుల నుంచి సాయం అందేలా చూడాల్సిందిగా సీఎం ఆర్‌బీఐ అధిపతిని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆర్థికమాంద్యం ఫలితంగా సహకార వ్యవస్థ నీరసించిందని, బ్యాంకులు సాయమందిస్తే గ్రామాల్లో సూక్ష్మ,మాధ్యమికస్థాయి పరిశ్రమలు, ఉపాధి వృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.
రాజన్ మర్యాదపూర్వకంగానే సీఎంతో భేటీ అయ్యారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా బ్యాంకింగ్‌రంగం తగిన సాయం అందిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ ఆశాభావం ప్రకటించారు. రాష్ట్రంలో కరువు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సందర్భంగా ఆయన రఘురామ్ రాజన్‌కు వివరించారు. జల వనరుల వికేంద్రకరణ, నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.