సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసును ప్రభావితం చేసేలా తరచుగా మీడియాతో మాట్లాడుతున్న వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టు బుధవారం కొట్టివేసింది.
వీరిద్దరూ మీడియాతో మాట్లాడిన సీడీలను పూర్తిగా పరిశీలించామని, వీరి వ్యాఖ్యలు సాక్షులను ప్రభావితం చేసేలా లేవని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సీబీఐ సమర్పించిన అన్ని రికార్డులను పరిశీలించామని, వారు చేసిన నేరారోపణలకు సంబంధించి ఆధారాలేవీ కనిపించడంలేదని స్పష్టంచేశారు. ధర్మాన, సబితలు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. అయినా సాక్షులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటే అందుకు వీరు బాధ్యులు కారని తేల్చిచెప్పారు.
వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ వేసిన మెమోలో సరైన కారణాలేవీ లేవని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. ‘‘మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే వ్యవహరించామని, తాము ఎటువంటి తప్పు చేయలేదని మీడియా ద్వారా ప్రజలకు వివరించడమే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు చేసిన తప్పా? సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ మీడియాతో మాట్లాడితే తప్పు లేనప్పుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాట్లాడితే చట్ట విరుద్ధం ఎలా అవుతుంది. దర్యాప్తు చేస్తున్నప్పుడు, చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు ధర్మాన, సబితలు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు.. ఇప్పుడెలా చేస్తారు? మంత్రులుగా ఉన్నపుడు సాక్షులను ప్రభావితం చేయని వారు మంత్రి పదవులు కూడా లేని ఈ సమయంలో ఎలా చేస్తారు? చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా వీరిని కస్టడీకి తీసుకోవాలని సీబీఐ కోరలేదు కదా!!
కోర్టు ప్రశ్నించినప్పుడు సైతం సమన్లు ఇస్తే సరిపోతుందని పేర్కొంది కదా!! అందుకని సహేతుకమైన కారణాలు చెప్పకుండా వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమో విచారణార్హం కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, గవర్నర్‌లను కలిసి కళంకిత మంత్రులంటూ ధర్మాన, సబితలపై ఫిర్యాదు చేశారు. వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారిపై ఉంది. ఆరోపణలకు వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మాత్రమే వారు వ్యాఖ్యానించారు’’ అని మంత్రుల తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.
మంత్రి ధర్మాన, సబితాల జ్యుడీషియల్ కస్టడీకి నో: సీబీఐ ప్రత్యేక కోర్టు
Published Thu, Aug 8 2013 2:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement