రేవంత్ రెడ్డి విడుదల రేపు
ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. జైలు నుంచి విడుదల అయ్యేందుకు మాత్రం మరో రోజు వేచి ఉండక తప్పడం లేదు. కోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. దర్యాప్తు అధికారుల ముందు పూచీకత్తులు, సాక్షులను ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు ఏసీబీ మెమో దాఖలు చేయనుంది. ఏసీబీ మెమో ఆధారంగానే ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వనుంది.
సాధారణంగా జైలు నుంచి ఖైదీలను సాయంత్రం 6 గంటలలోగానే విడుదల చేయాల్సి ఉంటుంది, అలాగే జైల్లోకి ఖైదీలను తీసుకురావడానికి కూడా అనుమతించరు. ఈలోపే మొత్తం లాంఛనాలన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే, హైకోర్టు నుంచి బెయిల్ పేపర్లు ఏసీబీ కోర్టుకు చేరుకున్నా, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం తగిన సమయంలో ష్యూరిటీ పేపర్లు సమర్పించలేకపోయారు. దాంతో ఆయన విడుదల మరొక్కరోజు ఆలస్యం అవుతోంది. బుధవారం నాడే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు.